Amaravathi: ‘మాట తప్పను మడమ తిప్పను’ అన్న జగన్ ఎందుకు వాగ్దానాలు చేశాడు?: రాజధాని రైతుల ఆగ్రహం
- రాజధాని రైతులకు తీవ్ర అన్యాయం చేశారు
- అమరావతి ప్రాంతంలో ముంపు వస్తుందా?
- మరి, విశాఖపట్టణం పరిస్థితి ఏంటి?
‘మాట తప్పను మడమ తిప్పను’ అన్న జగన్ ఎందుకు వాగ్దానాలు చేశాడంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ఉండాలన్న అంశాలపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన అనంతరం రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాజధాని అమరావతిలో ముంపు వస్తుందని చెబుతున్నారని, మరి, విశాఖలో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు తీవ్ర అన్యాయం చేశారంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, జీఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు. రాజధాని రైతులు ఎప్పుడంటే అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవచ్చనే జీవోను కూడా జగన్ తీసుకురావాలంటూ ఓ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వేల మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ‘రెడీ’గా ఉన్నారని, రాష్ట్రాన్ని నాశనం చేశారని మరో రైతు మండిపడ్డారు. రైతు కుటుంబాలను నాశనం చేశారని, ఈ జన్మలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడంటూ దుమ్మెత్తిపోశారు. వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోవడం ఖాయమని, తమ శాపనార్ధాలు తగలక తప్పవంటూ విరుచుకుపడ్డారు.