Hyderabad: తెలంగాణలో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉంటుంది: సీఎం కేసీఆర్
- వందశాతం సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు సాగుతున్నాం
- రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిపోయింది
- పేదల సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందున్నది
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. క్రిస్మస్ ట్రీని సీఎం వెలిగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
‘రాష్ట్రాన్ని వందశాతం సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతున్నాం. దేశంలో అన్ని మతాల పండగలను ఉత్సాహంగా జరుపుకుంటాం. ఇక్కడి ప్రజల జీవనం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. పండగలను సెలబ్రేట్ చేసుకునే గుణం, సహనం, మనుషులను మనుషులుగా ప్రేమించగలిగే తత్వం ఉంటే సమాజం ఏ విధంగా ఉంటుందనేదానికి నా రాష్ట్రం తెలంగాణ గొప్ప ఉదాహరణ. ఈ మైదనంలో ఇఫ్తార్, బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. పరస్పరం అభినందించుకుంటాం’ అని చెప్పారు.
రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వతంగా తొలగిపోయిందన్నారు. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తొలిగిపోయాయని చెప్పారు. పేదల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందున్నదన్నారు. మన రాష్ట్రం సాధించిన గొప్ప విజయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమని చెప్పారు. వచ్చే జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ఫలాలను మన రైతాంగం అనుభవిస్తుందన్నారు. క్రైస్తవులకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి కులం,మతం ప్రాతిపదిక కాదంటూ... వాళ్ల అవసరాలు, పేదరికం మాత్రమే ప్రాతిపదికగా పనులు జరుగుతాయన్నారు.