GN Rao: జీఎన్ రావు కమిటీ నివేదికతో విశాఖలో సంబరాలు!
- విశాఖలో సమ్మర్ క్యాపిటల్, సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న కమిటీ
- రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న నగర ప్రజలు
- ఆందోళనలో అమరావతి, కర్నూలు ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత విశాఖపట్టణంలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, వేసవి అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. కమిటీ నివేదికపై విశాఖవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని తెలియజేశారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కమిటీ చెప్పినట్టు చేస్తే విశాఖ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అంటున్నారు.
మరోవైపు, అమరావతిలో మాత్రం ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. జీఎన్‌రావు కమిటీ నివేదిక ప్రకారం.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మంత్రుల నివాసాలు మాత్రమే ఉంటాయి. కర్నూలులో హైకోర్టు, శీతాకాల అసెంబ్లీని ఏర్పాటు చేయాలి. కమిటీ నివేదికపై విశాఖ వాసులు సంబరాలు చేసుకుంటుండగా అమరావతి ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అక్కడి భూముల ధర అమాంతం పడిపోతుందని అంటున్నారు. రాజధానిని తరలించేందుకు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, కర్నూలు ప్రజలు కూడా కమిటీ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు, శీతాకాల అసెంబ్లీ రావడం వల్ల జిరాక్స్ సెంటర్లు వస్తాయే తప్ప అభివృద్ధి జరగదని విమర్శిస్తున్నారు.