Cyberabad: 'బుక్ చేసుకున్న క్యాబ్ రద్దు చేస్తే డ్రైవర్ కు జరిమానా పడుద్ది' అంటోన్న సైబరాబాద్ పోలీసులు
- బుక్ చేసుకున్న క్యాబ్ ను డ్రైవర్లు రద్దు చేస్తే జరిమానా
- మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 178 ప్రకారం చర్యలు
- డ్రైవర్లకు రూ.500 జరిమానా
క్యాబ్ బుక్ చేసుకుని ఎదురు చూస్తుంటాం. అయితే, ఒక్కోసారి ఎంతకీ క్యాబ్ రాదు. అకారణంగా డ్రైవర్ లు క్యాబ్ రైడ్ ను రద్దు చేస్తుంటారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే 'జరిమానా పడుద్ది' అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో 20 మంది క్యాబ్ డ్రైవర్లకు రూ.500 చొప్పున జరిమానా పడింది.
క్యాబ్ లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు సర్వీసు అందించకుండా డ్రైవర్లు విముఖత వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. క్యాబ్ డ్రైవర్లు అకారణంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే జరిమానా తప్పదని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది క్యాబ్ ప్రయాణికులకు ఊరట కలిగించే విషయమే.
బుక్ చేసుకున్న క్యాబ్ ను డ్రైవర్లు రద్దు చేస్తే ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 178 ప్రకారం... ప్రయాణికులు బుక్ చేసుకున్న అనంతరం ఆ క్యాబ్ బుకింగ్ ను డ్రైవర్ రద్దు చేస్తే రూ.500 జరిమానా పడుతుంది.
తాజాగా సైబరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయంపై ఓ ట్వీట్ చేశారు. ప్రయాణికులు బుక్ చేసుకున్న క్యాబ్‌ను డ్రైవర్లు రద్దు చేస్తే వెంటనే తమ వాట్సాప్ నంబరు 94906 17346కు మెసేజ్ పంపాలని చెప్పారు. బుక్ చేసుకున్న వాహనం నంబరు, తేదీ, సమయం, ప్రాంతం, క్యాబ్ రద్దయిన విషయానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తమకు పంపాలని చెప్పారు.
క్యాష్ పేమెంట్ చేయకుండా ప్రయాణికులు డ్రైవర్లకు ఇతర మార్గాల్లో (నగదు రహిత పేమెంట్) చార్జీలు చెల్లిస్తున్న నేపథ్యంలో కొందరు క్యాబ్ డ్రైవర్లు ఇందుకు నిరాకరిస్తూ క్యాబ్ ను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాంతాల్లో అత్యధిక మంది క్యాబ్ లను బుక్ చేసుకుంటారు. అయితే, డ్రైవర్లు క్యాబ్ లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులు మూడు, నాలుగు గంటల పాటు అక్కడే ఎదురు చూడాల్సి వస్తోంది. చివరకు ఇతర వాహనాల్లో వెళ్తున్నారు. దీంతో ఫిర్యాదులు అధికమవుతున్నాయి.