volkswagen: జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు 86 మిలియన్ డాలర్ల జరిమానా!
- ఉద్గారాల టెస్ట్ సందర్భంగా సాఫ్ట్వేర్లను ఆఫ్ చేసిన ఫోక్స్‌వ్యాగన్
- ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టం ఉల్లంఘన
- తొలిసారి భారీ జరిమానా విధించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ కోర్టు
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఏకంగా 86 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. డ్ర్రైవింగ్ కండిషన్ టెస్ట్ సందర్భంగా రెండు సాఫ్ట్వేర్లను ఆఫ్ చేసి డీజిల్ ఉద్గారాల విడుదలను తప్పుగా చూపించినందుకు గాను ఈ జరిమానా విధించింది. ఉద్గారాల ప్రమాణాలను పాటించడంలో విఫలం కావడంతోపాటు ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఈ జరిమానా విధించినట్టు ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్జుమర్ కమిషన్ (ఏసీసీసీ) తెలిపింది.
ఉద్గారాలను పరీక్షించేందుకు నిర్వహించిన పరీక్ష సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ రెండు సాఫ్ట్వేర్లను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేసింది. ఫలితంగా నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాల వాస్తవిక స్థాయులు కనిపించకుండా పోయాయి. ఇదే విషయాన్ని ఫోక్స్‌వ్యాగన్ కూడా అంగీకరించింది. 2011-2015 మధ్య ఇది జరిగింది. ఫోక్స్వ్యాగన్ది ఘోరమైన ఉద్దేశపూర్వక చర్యగా ఏసీసీసీ చైర్ రాడ్ సిమ్స్ పేర్కొన్నారు. కాగా, ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి. కాగా, ఫెడరల్ కోర్టు జరిమానాపై ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటి వరకు స్పందించలేదు.