Narendra Modi: మోదీ ర్యాలీ కోసం కనీవినీ ఎరుగని భద్రత... స్నిప్పర్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఎన్ఎస్జీ!
- నేడు రామ్ లీలా మైదానంలో మోదీ ర్యాలీ
- 11 రీజియన్లుగా విభజించి భద్రత
- యాంటీ డ్రోన్ టీముల పహారా
నేడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీజేపీ నిర్వహించతలపెట్టిన భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఉండే భద్రతకు అదనంగా 20 మంది డీసీపీ స్థాయి అధికారులను భద్రతకు నియమించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఓ ర్యాలీలో తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఈ ర్యాలీకి హాజరయ్యే ప్రతి ఒక్కరి చిత్రాన్నీ తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న భవంతులపై అత్యాధునిక ఆయుధాలతో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు స్నిప్పర్స్ ను విధుల్లో ఉంచామని వెల్లడించారు. అనుక్షణం ఎన్ఎస్జీ కమాండోలు పహారా కాస్తారని తెలిపారు.
ర్యాలీ జరిగే మైదానాన్ని 11 రీజియన్లుగా విభజించామని, యాంటీ డ్రోన్ టీముల పహారా కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీకి వచ్చే వారిని రెండు సార్లు తనిఖీలు చేస్తామని అన్నారు. కాగా, శుక్రవారం నాడు పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్, ఈ ర్యాలీని టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో, మరిన్ని భద్రతా చర్యలు చేపట్టారు.