BJP: చంద్రబాబు, జగన్ దొందూ దొందే : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా
- ఇద్దరి ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజం
- హైదరాబాద్ వల్లే కదా ఆంధ్రప్రదేశ్ కు నష్టం
- జగన్ సర్కారు చంద్రబాబు ట్రాప్ లో పడుతోంది
నాడు చంద్రబాబు సర్కారు, నేడు జగన్ సర్కారూ రెండూ ఒక్కలాంటివేనని, ఇద్దరి పాలనా 'దొందూ దొందే' అన్నట్లు సాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండి పడ్డారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చంద్రబాబు తెలివైన రాజకీయం ప్రదర్శిస్తుంటే, ఆయన ట్రాప్ లో జగన్ పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పదేపదే హైదరాబాద్ లాంటి అభివృద్ధి అని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
నవ్యాంధ్రకు జరిగిన నష్టం హైదరాబాద్ వల్లే కదా అని ఆయన అన్నారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో చంద్రబాబు తన పాలనలో ఒక్క పోర్టు అయినా నిర్మించారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మాట అంటున్నానంటే నేనేదో వైఎస్సార్‌ను పొగుడుతున్నానని కాదని గుర్తుంచుకోవాలని కోరారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రతనాల సీమగా మారాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం ఆకాంక్షిస్తోందని, అందుకోసం జగన్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.