nagababu: నష్టం జరిగింది.. జరుగుతోంది.. జరగబోతుంది: నాగబాబు ఆగ్రహం
- రైతులకు జరిగిన అన్యాయాన్ని కళ్లారా చూశా
- అమరావతిలో సేకరించిన మొత్తం భూమి 34,322 ఎకరాలు
- భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 29,881
- ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు
రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై తన అభిప్రాయాలను తెలుపుతూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయాన్ని తాను కళ్లారా చూశానని తెలిపారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి తాము మందడం వెళ్లామని, అక్కడ రైతుల బాధలను తెలుసుకున్నామని నాగబాబు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతిలో సేకరించిన మొత్తం భూమి 34,322 ఎకరాలని ఆయన అన్నారు. భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 29,881 అని అన్నారు.
అయితే, ఇందులో ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుతం ప్రభుత్వం ఆరోపిస్తోందని నాగబాబు అన్నారు. అది వాస్తవంగా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, దేశంలో కుహనా లౌకిక ఉదారవాదుల వల్ల ఈ దేశానికి చాలా చాలా నష్టం జరిగిందని, జరుగుతోందని, జరగబోతోందని ఆయన ట్వీట్ చేశారు.