Palle Pragathi: పల్లె ప్రగతి పరిశీలన కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్: సీఎం కేసీఆర్
- పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో బృందాలు
- అలసత్వం వహిస్తే క్షమించేదిలేదన్న కేసీఆర్
తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలో దిగుతున్నాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబరులో 30 రోజుల పాటు నిర్వహించిన పల్లె ప్రగతి సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు.
దిద్దుబాటు చర్యల కోసమే ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు జరుపుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను పటిష్టపరిచామని, ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇది పరీక్షలాంటిదని స్పష్టం చేశారు.