Jharkhand: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఝార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. నేతల్లో ఉత్కంఠ!
- రాష్ట్రంలో ఐదు విడతలుగా జరిగిన ఎన్నికలు
- మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి ఫలితాలు
- గెలుపుపై ఎవరి ధీమా వారిదే
మరో గంటలో ఝార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, పది గంటలకు ఫలితాల సరళి తెలిసిపోనుంది. ఒంటి గంటకల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. విజయంపై అటు కాంగ్రెస్ కూటమి, ఇటు అధికార బీజేపీలు ధీమాగా ఉన్నాయి.
అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అయితే, తాము అధికారంలోకి రావడం పక్కా అని ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యాజిక్ నంబరు అయిన 42 స్థానాలను సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలపై నాయకుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.