Dolls: ప్లాస్టిక్ బొమ్మల్లో పరిమితికి మించి అనవసర లోహాలు.. దిగుమతి నిబంధనలు మరింత కఠినతరం!
- దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బొమ్మలు
- నాణ్యత ప్రమాణాలకు పాతర
- దిగుమతి నిబంధనలు కఠినతరం
దేశంలోకి దిగుమతి అవుతున్న బొమ్మల్లో అనవసర లోహాలు అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించిన కేంద్రం.. వాటి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దిగుమతి నిబంధనలు కఠినతరం చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ.. తక్కువ నాణ్యత కలిగిన బొమ్మలు మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. దిగుమతి అవుతున్న బొమ్మల నమూనాలు సేకరించి ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
వాటిలో నాణ్యత లేదని తేలితే మొత్తం సరుకులను వెనక్కి పంపిస్తామని, లేదంటే నాశనం చేస్తామని తేల్చి చెప్పింది. భారత నాణ్యతా మండలి అధ్యయనం ప్రకారం దేశంలోకి దిగుమతి అవుతున్న ప్లాస్టిక్ బొమ్మల్లో 67 శాతం నాణ్యత లేనివే. 30శాతం బొమ్మల్లో పరిమితికి మించి అనవసర లోహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.