Soudhi Arabia: సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష
- మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష
- మొత్తం 11 మందిని విచారించిన సౌదీ న్యాయస్థానం
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం లేదన్న సౌదీ ప్రభుత్వం
వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు కాలమిస్ట్ గా పనిచేసిన సౌదీ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.. ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు తాజాగా తీర్పు వెలువరిస్తూ.. ఐదుగురికి మరణ శిక్ష విధించింది. మరో ముగ్గురికి తలా 24 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ ప్రాసిక్యూటర్ వివరాలను వెల్లడించారు. ఈ హత్యతో ప్రత్యక్షంగా సంబంధమున్న ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణశిక్ష విధించిందని తెలిపారు.
ఖషోగీ తన రచనల్లో సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. చివరిసారిగా ఖషోగీ గత ఏడాది అక్టోబర్ 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని సౌదీ రాయబార కార్యాలయం వద్ద కనిపించారు. అక్కడే ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో సౌదీ కోర్టు మొత్తం 11 మందిని విచారించింది. సౌదీ అటార్నీ జనరల్ దర్యాప్తులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాజీ ముఖ్య సలహాదారుడు సౌద్ అల్ కహతాని ప్రమేయం ఉందని నిరూపితం కాకపోవడంతో ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు విడుదల చేసింది.
మరోవైపు ఈ హత్య కేసులో, కొత్తగా యువరాజుగా ప్రకటించబడ్డ మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్లు సీఐఏ నిర్ధారించిందంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. కాగా, ఈ ఆరోపణలు నిజంకావని ఆ పత్రిక ప్రకటనను సౌదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది ఇలావుండగా, ఈ హత్య తన హయాంలో జరిగిందంటూ.. మహ్మద్ బిన్ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు సెప్టెంబర్ నెలలో టీవీ మాధ్యమంగా ప్రకటించడం విశేషం.