Congres Satyagraha: రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
- పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ.. నిరసన
- రాజ్యాంగంలోని ప్రవేశికను చదివిన సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్
- రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పిలుపు
సీఏఏపై కాంగ్రెస్ తనదైన శైలిలో నిరసనకు దిగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు మహాత్మాగాంధీ సమాధి స్థలం రాజ్ ఘాట్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. దేశ ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న వారిలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, సీనియర్ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ సహా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ రాజ్యాంగంలోని ప్రవేశికను చదివి వినిపించారు. ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ సత్యాగ్రహ దీక్ష దేశ ప్రజల సమైక్యత కోసమేనని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ముఖ్యంగా యువత కేంద్రం చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పవిత్రతను కాపాడాలని యువత కోరుకుంటోందన్నారు. వారికి కాంగ్రెస్ మద్దతునిస్తుందని చెప్పారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా తమ పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.