Raghurama Krishnam Raju: అమరావతి రైతుల ఆందోళనను తప్పుపట్టడం న్యాయం కాదు: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • అమరావతికి కేబినెట్, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి
  • రాజధాని రైతుల కోరికలో తప్పులేదు
  • ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

ఏపీకి మూడు రాజధానులు అనే అంశం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, అమరావతి రైతుల ఆందోళనను తప్పుపట్టడం న్యాయం కాదని వ్యాఖ్యానించారు. రాజధానిని పూర్తి స్థాయిలో విశాఖకు తరలించడం లేదని... అమరావతితో పాటు విశాఖ కూడా ఒక రాజధానిగా ఉంటుందని చెప్పారు. అమరావతి రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.

రాజధాని అంశానికి కేబినెట్ ఆమోదం లభించాలని, అసెంబ్లీలో ఆమోదం పొందాలని... అప్పుడు కానీ పూర్తి క్లారిటీ రాదని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధానిగా అమరావతికి కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయని... ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు కోరడంలో తప్పు లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిందని... ఒక రాజధాని అక్కడ ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అన్నారు. అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స కూడా చెప్పారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News