GST: త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్యాలయంలో జీఎస్టీ దాడులు!
- తప్పుడు ఆదాయాన్ని చూపినట్టు పలువురిపై అనుమానం
- హారికా హాసినీ, వక్కంతం వంశీ కార్యాలయాల్లోనూ సోదాలు
- మొత్తం 15 ప్రాంతాలను తనిఖీ చేస్తున్న అధికారులు
తప్పుడు ఆదాయాన్ని చూపి జీఎస్టీని తక్కువగా చెల్లించారన్న ఆరోపణలపై జీఎస్టీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వ్యాపారవేత్తలపై దాడులు జరుపుతుండటం కలకలం రేపుతోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లోను, త్రివిక్రమ్ శ్రీనివాస్, వక్కంతం వంశీ కార్యాలయాలపైనా, సినీ నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్, సితారా ఎంటర్ టెయిన్ మెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి.
దర్శక నిర్మాతలు, బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు ధ్రువపత్రాలను దాఖలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని వీరు ఎగ్గొట్టారన్నది ప్రధాన ఆరోపణ. వీరు చెల్లించిన పేమెంట్స్, సమర్పించిన పత్రాలు సరైనవేనా? అన్న కోణంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.