IPS Maheswar reddy: ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్ రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ‘క్యాట్’
- తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదు
- వరకట్న వేధింపుల కింద కేసు నమోదు
- కేంద్ర హోంశాఖ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ‘క్యాట్’
ట్రైనీ ఐపీఎస్ కొక్కంటి మహేశ్వర్‌రెడ్డికి ఊరట లభించింది. వరకట్న వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఆ సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ శిక్షణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ పోలీస్ అకాడమీని ఆదేశించింది.
కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌రెడ్డి తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ భావన అనే యువతి అక్టోబరు 27న జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన కేంద్రం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు శిక్షణ నుంచి మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహేశ్వర్‌రెడ్డి తనపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్‌లో సవాలు చేశాడు. తాజాగా అతడిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.