Gandhi hospital: గాంధీ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. 20 రోజుల తర్వాత మళ్లీ అక్కడే ప్రత్యక్షం!
- బాలుడి ఫొటోతో పోస్టర్లు అతికించిన పోలీసులు
- కిడ్నాపర్ల ముఠా గుర్తింపు
- దొరికిపోతామన్న భయంతో బాలుడిని వదిలేసిన కిడ్నాపర్లు
20 రోజుల క్రితం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఓ బాలుడు కిడ్నాపయ్యాడు. తాజాగా, ఆ బాలుడు మళ్లీ అక్కడే ప్రత్యక్షమయ్యాడు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మౌలాలికి చెందిన దంపతులకు నలుగురు సంతానం. మహిళ భర్త ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడంతో పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో నెలరన్నర క్రితం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును పరామర్శించేందుకు వెళ్లింది.
ఈ క్రమంలో ఆసుపత్రిలో రోగుల సహాయకులు ఉండేందుకు షెడ్లు, ఆసుపత్రి ముందు అన్నదానం చేస్తుండడాన్ని గమనించిన ఆమె, ఇక అప్పటి నుంచి పిల్లలతో కలసి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తెల్లవారుజామున ఆమె చిన్న కుమారుడు అదృశ్యమయ్యాడు. వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లడం కనిపించింది. ముగ్గురు మహిళలు, పద్నాలుగేళ్ల కుర్రాడు, పాపతో కూడిన బృందమే చిన్నారిని అపహరించినట్టు నిర్ధారించారు. సీసీటీవీలో కనిపించిన ముఠాను తాను అక్కడి షెడ్డులో చూసినట్టు బాలుడి తల్లి తెలిపింది. మరోవైపు, బాలుడి ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు ఆసుపత్రిలో అతికించడంతో దొరికిపోతామని కిడ్నాపర్లు భయపడ్డారు. దీంతో బాలుడిని అపహరించిన చోటే అతడిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో కిడ్నాప్ కేసు సుఖాంతమైంది.