Asaduddin Owaisi: ఎన్సార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్: అసదుద్దీన్ ఒవైసీ
- ఎన్పీఆర్ కి, ఎన్సార్సీకి ఏ సంబంధమూ లేదా?
- అమిత్ షా దీనిపై దేశ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?
- ఎన్నార్సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని పార్లమెంటులో చెప్పారు
కేంద్ర ప్రభుత్వంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జాతీయ జనాభా జాబితా (ఎన్పీఆర్) ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. దీనికి, ఎన్సార్సీకి ఏ సంబంధమూ లేదా? అని ఆయన ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్ షా దీనిపై దేశ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన నిలదీశారు.
ఎన్నార్సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని అమిత్ షా పార్లమెంటులో చెప్పారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు సత్యాన్ని చెబుతూనే ఉంటామని అన్నారు. ఎన్సార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్ అని ఆయన ఆరోపించారు. ఎన్పీఆర్ కోసం అధికారులు ప్రజలను ధ్రువీకరణ పత్రాలు అడుగుతారని, దీనిపై విడుదల చేసే తుది జాబితాయే ఎన్సార్సీ అని ఆయన అభిప్రాయపడ్డారు.