Sabarimala: పంబలో పరిస్థితి... సాయంత్రం వరకే దర్శనం... 55 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్!
- సూర్య గ్రహణం, ఆపై మండల పూజ ముగింపు
- స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న 3 లక్షల మంది
- అందరికీ దర్శనం సాధ్యం కాదంటున్న టీడీబీ
రేపు సూర్యగ్రహణం కావడంతో శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేటి సాయంత్రం మూసుకోనుండటం, ఆపై 26 సాయంత్రానికి మండల పూజలు ముగియనుండటంతో అయ్యప్ప స్వాముల రద్దీ ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది.
సన్నిధానం నుంచి పంబ వరకూ భక్తులు లక్షలాదిగా స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా, ఎరుమేలి వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. 55 కిలోమీటర్ల దూరం వరకూ వాహనాలు నిలిచిపోగా, ఈ దూరం ప్రయాణానికి 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు తమ వాహనాలను వదిలేసి, ఆలయానికి నడిచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అయినప్పటికీ, కొండపై భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో, వీరిని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. నీలక్కల్ పార్కింగ్ నుంచి పంబ వరకూ కేరళ ఆర్టీసీ వేసిన ప్రత్యేక బస్సులు ఒక్క అడుగు కూడా కదిలే పరిస్థితి కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు నీలక్కల్ చేరుకున్న వాహనాలను రాత్రి 10 గంటల తరువాత అనుమతించారు.
ఆపై ఈ తెల్లవారుజాము నుంచి వాహనాలను అనుమతించలేదు. ఇప్పటివరకూ మండల పూజకు 25 లక్షల మంది వరకూ భక్తులు హాజరు కాగా, మరో 3 లక్షల మంది భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి మండల పూజ ముగిసేలోగా, దర్శనం కల్పించడం అసాధ్యమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు అంటున్నారు.