Jagan: పులివెందులపై జగన్ వరాల వర్షం!
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- రూ. 347 కోట్లతో వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల
- తాగునీటి, డ్రయినేజ్ పథకాలకు నిధుల మంజూరు
కడప జిల్లాలో తన మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, సొంత నియోజకవర్గంపై వరాల వర్షం కురిపించారు. ఈ ఉదయం సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే నిర్మితమైన భవనాలను ప్రారంభించారు. పట్టణంలో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను జగన్ ప్రారంభించారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇక్కడి ప్రజలు తమ కుటుంబాన్ని ఎంతలా ఆదరిస్తున్నారో గుర్తు చేసుకున్నారు. పులివెందుల బిడ్డగా, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అంతకుముందు రూ. 347 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలకు జగన్ శంకుస్థాపన చేశారు.
గాలేరు - నగరి సుజల స్రవంతి మెయిన్ కెనాల్ నుంచి అలవలపాడు ట్యాంక్, వేముల, వేంపల్లె మండలాలకు నీరందించే ఎత్తిపోతల పథకానికి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లె ట్యాంక్, లింగాల, పులివెందుల మండలాలతోపాటు వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాలకు నీరందించే ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.
పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ. 100 కోట్ల నిధులను ప్రకటించారు. ఇంటింటికీ నీరందించే సమీకృత పథకానికి తక్షణం రూ. 65 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వేంపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ. 63 కోట్లను ప్రకటించారు. జేఎన్టీయూలో లెక్చరర్ కాంప్లెక్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ల కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తామని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక సంస్థల కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో డ్యామ్ నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన సర్వే పనులు ప్రారంభమయ్యాయని జగన్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 7 గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని, మార్కెట్ యార్డ్ ను ఆధునికీకరించే పనులు తక్షణం మొదలు పెడతామని తెలిపారు. ఉద్యానవన పంటల కోసం కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని అన్నారు.
అలాగే, వేంపల్లి ఆసుపత్రిలో ప్రస్తుతమున్న 30 పడకలను 50 పడకలకు పెంచేందుకు నిధులను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ కోసం రూ. 17.50 కోట్లను మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ అకాడమీలో 14 రకాల క్రీడలకు ఉచితంగా శిక్షణ అందిస్తారని తెలిపారు. ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం రూ. 20 కోట్లను, పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.