Dharmana Prasad: నా మాట తప్పనిపిస్తే క్షమించండి: అమరావతి రైతుతో ధర్మాన
- 'లింగులింగుమంటూ' పదాన్ని వెనక్కి తీసుకుంటున్నా
- ఎమ్మెల్యేకు నేరుగా ఫోన్ చేసిన ఓ యువకుడు
- ఈ సందర్భంగా నొచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు
రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల విషయంలో నోరుజారి విమర్శలపాలైన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన మాటను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులు క్షమించాలని కోరారు.
నిన్న జరిగిన ఓ సభలో అమరావతి రైతులనుద్దేశించి ధర్మాన మాట్లాడుతూ 'లింగులింగు మంటూ ఎనిమిది ఏడూర్లవాళ్లు ఆందోళన చేస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అమరావతి కేంద్రంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో రాజధానికి చెందిన ఓ యువకుడు ధర్మానకు నేరుగా ఫోన్ చేశాడు.
నమస్తే సార్...బాగున్నారా? అంటూ కుశలం అడిగిన తర్వాత 'సార్...మీరు ప్రయోగించిన లింగులింగుమంటూ... అన్న పదంతో ఇబ్బందిగా ఉంది సార్. ఆ మాట బాగోలేదు' అని అన్నాడు. దీనిపై ధర్మాన స్పందిస్తూ 'మీకు నచ్చలేదు కదా ఆ మాట. నన్ను క్షమించేయండి. అమరావతి వచ్చాక కలుద్దాం' అంటూ వివరణ ఇచ్చారు.