Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కు భద్రతను తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం
- ఇకపై సచిన్‌కు 24 గంటల భద్రత బంద్
- ఇకపై ఎస్కార్ట్ సదుపాయం మాత్రమే
- సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరేకు భద్రత పెంపు
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు భద్రతను కుదిస్తూ మహారాష్ట్రలోని 'మహా వికాస్ అఘాడీ' కూటమి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచిన్ కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై సచిన్‌కు 24 గంటల భద్రత ఉండదు. ఎస్కార్ట్ సదుపాయం మాత్రం ఉంటుంది.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిత్యకు ఇప్పటివరకు వై ప్లస్ సెక్యూరిటీ భద్రత ఉండేది. ఇకపై ఆయనకు జెడ్ ప్లస్ భద్రత అందనుంది. పలువురికి ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆదిత్యకు సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సేకు ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. యూపీ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌కు ఉన్న జెడ్ ప్లస్ భద్రతను తొలగించి ఎక్స్ కేటగిరీకి మార్చారు.