Britanin: బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్?
- తాజా ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున గెలిచిన రిషి
- ప్రధాని జాన్సన్ కు అత్యంతసన్నిహితుడని రిషికి పేరు
- ఫిబ్రవరిలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో రిషికి చోటు?
భారత సంతతికి చెందిన వ్యక్తిని బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ఈ పదవిలో నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. ప్రధాని బోరిస్ జాన్సన్ కి రిషి అత్యంత సన్నిహితుడని పేరు. గతంలో ఉప ఆర్థిక మంత్రిగా రిషి పనితీరుపై జాన్సన్ సంతృప్తిగా ఉన్నారని, అందుకే, ఆర్థిక మంత్రిగా ఆయన్నే నియమించాలని భావిసున్నట్టు సమాచారం.
అంతేకాకుండా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాలో నిర్వహించే చర్చల్లో రిషి పాల్గొనేవాడని, పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. కాగా, ఫిబ్రవరిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో రిషికి ఈ పదవి దక్కనుంది.
ఇంకా, రిషి గురించి చెప్పాలంటే.. ఆయన వయసు 39 సంవత్సరాలు. ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ కౌంటీలో జన్మించారు. స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో రిషి తన సహవిద్యార్థిని అక్షతామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రిచ్ మాండ్ నుంచి ఆయన ఎంపీగా పోటీ కావడం ఇది మూడోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో రిషి మంత్రిగా పని చేశారు.