Amaravathi: రేపటి నుంచి విజయవాడ ధర్నాచౌక్ లో ధర్నా చేస్తున్నాం: అమరావతి పరిరక్షణ సమితి
- అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్ష భేటీ
- ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు చేపడతాం
- మంత్రి వర్గ భేటీలో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోవద్దని డిమాండ్
ఏపీ రాజధాని తరలించాలన్న ప్రతిపాదనపై అమరావతి రైతులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాజధాని రైతులతో పాటు ప్రజాసంఘాలు, వివిధ సంఘాల నేతలు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెలగపూడి, మందడం, తుళ్లూరు.. తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగిన రైతులు రేపటి నుంచి విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు దిగనున్నట్టు అమరావతి పరిరక్షణ సమితి పేర్కొంది.
అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని తరలించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు చేపడతామని, నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలుపుతామని అన్నారు. మంత్రి వర్గ భేటీలో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.