Khalistan: పంజాబ్ లో దాడులకు ప్లాన్ చేస్తున్న ఖలిస్థాన్ టెర్రరిస్టులు.. భారీగా ఆయుధాల స్మగ్లింగ్
- ఖలిస్థాన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహకారం
- రాజస్థాన్, హర్యానాలో కూడా ఖలిస్థాన్ కదలికలు
- సరిహద్దుల్లో అప్రమత్తమైన బలగాలు
తన దౌత్యనీతితో పాకిస్థాన్ ను భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా చేయడంలో భారత్ సఫలీకృతమైంది. మొన్నటి వరకు పూర్తి సహకారం అందించిన దేశాలు కూడా ఇప్పుడు పాకిస్థాన్ కు మద్దతు ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో, మన దేశంపై పాక్ రగిలిపోతోంది. దేశంలో అలజడులు సృష్టించేందుకు శాయశక్తులా యత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా జమ్ముకశ్మీర్ లో హింసకు తెగబడేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్... మరోవైపు, పంజాబ్ లో దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది.
పంజాబ్ లో ఉగ్రదాడులకు ఖలిస్థాన్ టెర్రరిస్టులు యత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ తెలిపింది. పాక్ నుంచి పంజాబ్ కు అక్రమంగా ఆయుధాలను తరలించడాన్ని ఖలిస్థాన్ టెర్రరిస్టులు ఇటీవలి కాలంలో ఎక్కువ చేశారని వెల్లడించింది. బబ్బర్ ఖల్సా, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రసంస్థలు ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్నాయని తెలిపింది. రాజస్థాన్, హర్యానాలో కూడా ఖలిస్థాన్ కదలికలు కనిపిస్తున్నాయని చెప్పింది.
ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్, ఎన్ఐఏ, రా, ఐబీలు ఖలిస్థాన్ ఉగ్రవాదులపై నిఘాను పెంచాయి. పంజాబ్, పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడ శిక్షణ పొందుతున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నాయి.