Kesineni Nani: నాపై రౌడీ షీట్ ఉందా? క్రిమినల్ కేసులు ఉన్నాయా?: పోలీసులపై కేశినేని నాని ఆగ్రహం
- కేశినేని నానిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- నోటీసులైనా ఇచ్చారా? అని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ
- నన్ను ఆపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్న
టీడీపీ ఎంపీ కేశినేని నానిని విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వెళ్లనున్న నేపథ్యంలో, గృహ నిర్బంధం చేశారు. ఈ ఘటనపై కేశినేని నాని మండిపడ్డారు.
ఎంపీగా ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లకుండా ఎలా ఆపుతారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నాపై రౌడీ షీట్ ఉందా? క్రిమినల్ కేసులు ఉన్నాయా? అని నిలదీశారు. తనను ఆపే హక్కును పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఢిల్లీ, బెంగళూరులో లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారని... వారిని ఎవరు ఆపారని ప్రశ్నించారు. పోలీసుల తీరు అభ్యంతరకరమని చెప్పారు.