Vijay Sai Reddy: ఇది చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిపోవాలన్నదే మనందరి ఆకాంక్ష: విజయసాయి రెడ్డి
- విమానాశ్రయం నుంచి ఆర్కే బీచ్ వరకు జగన్ కాన్వాయ్ వెళ్తుంది
- 24 కిలోమీటర్లను కవర్ చేస్తూ మానవహారం
- భవిష్యత్తులో మరిన్ని పథకాలకు శ్రీకారం చుడుతాం
- విశాఖ ఫెస్ట్ లో ఈ సారి లేజర్ షో
ఈ నెల 28న విశాఖకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలకబోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకు.. అక్కడి నుంచి సెంట్రల్ పార్క్ వరకు.. అక్కడి నుంచి ఆర్కే బీచ్ వరకు మానవ హారం ఉంటుంది. ఉత్తరాంధ్రలోని ప్రాంతాన్ని పాలనాపరమైన రాజధానిగా జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల కోరిక మేరకు జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు' అని తెలిపారు.
'మానవహారంలా ఏర్పడడం అంటే చేతులు పట్టుకొని నిలబడడం కాదు. మనిషి పక్కనే మనిషి నిలబడి 24 కిలోమీటర్లను కవర్ చేస్తారు. వాహనంలో సీఎం జగన్ కూర్చునేది ఎడమవైపు కాబట్టి ఎడమ వైపునే ఈ మానవ హారం ఉంటుంది. ఆయనకు స్వాగతం పలుకుతూ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇందులో పాల్గొంటారు. ఇది చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిపోవాలన్నదే మనందరి ఆకాంక్ష' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
'మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగొచ్చు. 24 కిలోమీటర్లు కాన్వాయ్ వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు సహకరించాలి. భవిష్యత్తులో మరిన్ని పథకాలకు శ్రీకారం చుడతాం. విశాఖ ఫెస్ట్ లో ఈ సారి లేజర్ షో పెట్టాలని భావించాం. దీనికి జగన్ కూడా ఒప్పుకున్నారు. లేజర్ షోలో వైఎస్ఆర్, జగన్, నవరత్నాలను ప్రతిబింబిస్తూ దృశ్యాలను చూడొచ్చు' అని విజయసాయి రెడ్డి తెలిపారు.