MV Mysura Reddy: విశాఖలో రాజధాని ఏర్పాటు చేయమని ఎవరడిగారు?: మైసూరారెడ్డి
- మూడు రాజధానుల అంశంపై మైసూరారెడ్డి స్పందన
- అడగనివాళ్లకు రాజధాని ఇచ్చారంటూ అసంతృప్తి
- హైకోర్టుతో ఎంతమందికి అవసరం ఉంటుందన్న మైసూరా
సీనియర్ రాజకీయవేత్త ఎంవీ మైసూరారెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఎవరు డిమాండ్ చేశారని విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు విశాఖ వైపు మొగ్గుచూపిందని నిలదీశారు.
విశాఖలో అభివృద్ది జరిగిందని సీఎం జగన్ కూడా అంగీకరించాడని, అలాంటప్పుడు విశాఖలో కొత్తగా రాజధాని ఏర్పాటుచేసి ఏం సాధిస్తారని అడిగారు. ఏమీ అడగని వాళ్లకు రాజధాని ఇస్తున్నారని విమర్శించారు. రాజధానిని ముక్కలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే రాయలసీమకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హైకోర్టును రాయలసీమకు ఇవ్వడం న్యాయమైన వాటా అనిపించుకోదని, హైకోర్టుతో ఎంతమందికి అవసరం ఉంటుందని అన్నారు.