Police: ప్రతి కిలోమీటర్ కి ఓ చెక్ పోస్టు.. పోలీసుల అధీనంలో ప్రకాశం బ్యారేజ్!
- పోలీసుల దిగ్బంధంలో అమరావతి రహదార్లు
- అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్న పోలీసులు
- న్యాయవాదులను అడ్డుకోవడంతో వాగ్వాదం
నేడు అమరావతిలో జరగనున్న మహాధర్నా, ఏపీ క్యాబినెట్ మీటింగ్ నేపథ్యంలో పోలీసులు విజయవాడ నుంచి అమరావతి వైపు దారి తీసే అన్ని రహదారులనూ దిగ్బంధించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు, ప్రతి కిలోమీటర్ కు ఓ బారికేడ్ పెట్టారు. రహదారులపై ఎవరు నడవాలన్నా వారు సంబంధిత గ్రామ వాసులేనని రుజువుచేసే ధ్రువీకరణ పత్రం తప్పనిసరని, గత రెండు రోజులుగా మైకుల్లో ప్రచారం చేయించారు.
విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ మీదుగా మంగళగిరి వైపు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బ్యారేజ్ వైపు వస్తున్న ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దాటిన తరువాత, ఏ వాహనాన్నీ కరకట్ట వైపునకు తిరగనివ్వడం లేదు. గుంటూరు నుంచి అమరావతి వైపు వెళ్లే రహదారులపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. సరైన వివరాలు చెప్పని వాహనదారులను వెనక్కు పంపుతున్నారు. కాగా, ఈ ఉదయం అమరావతిలోని హైకోర్టుకు పయనమైన కొందరు న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.