Kanna: అమరావతి మొత్తాన్ని అమ్మేసేందుకు కుట్ర జరుగుతోంది: మౌనదీక్ష అనంతరం నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీనారాయణ
- రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది
- రాష్ట్రాన్ని వారి జాగీరులా భావిస్తున్నారు
- ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు
అమరావతిని రాజధానిగా కొసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్ధండరాయునిపాలెంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్ష ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పించిందని... కానీ, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే... ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతం మొత్తాన్ని అమ్మేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీని వేయడం, కమిటీ నివేదిక రాకముందే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల గురించి మాట్లాడటం చూస్తే... ఇదంతా కుట్ర అనే విషయం అర్థమవుతుందని అన్నారు.
అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని... అభిప్రాయాలను తీసుకోకముందే ఈరోజు కేబినెట్ మీటింగ్ పెట్టారని... మరోవైపు, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పండగ చేసుకుందామని ప్రకటించడం చాలా దారుణమని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని... రాష్ట్రాన్ని వారి జాగీరులా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నియంతృత్వాన్ని, అహంకార ధోరణిని బీజేపీ ఖండిస్తోందని అన్నారు.
మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పిన జగన్... రాష్ట్ర ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. ఇలాంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.
ఏపీ కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. జీఎన్ రావు కమిటీని తాను స్వాగతిస్తున్నట్టు మీడియాతో ఎప్పుడైనా చెప్పానా? అని ప్రశ్నించారు. తాను తెలుగు మీడియంలో చదువుకున్నానని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారని... అందుకే, తాను తెలుగులో మాట్లాడితే వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ మద్దతిస్తుందని, పాలన వికేంద్రీకరణకు ఒప్పుకోదని చెప్పారు.