Peddapalli District: బసంత్ నగర్ ఎయిర్ స్ట్రిప్ కు మహర్దశ... విమానాశ్రయంగా అభివృద్ధి

  • బిర్లాలు తమ సొంత అవసరాల కోసం ఏర్పాటు
  • పది హేనేళ్లుగా నిరుపయోగంగా స్థలం 
  • విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కారు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎయిర్ స్ట్రిప్ కు మహర్దశ పడుతోంది. రెగ్యులర్ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విశాలమైన రాష్ట్రంలో ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప మరొకటి లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లాలు తమ సొంత అవసరాల కోసం బసంత్ నగర్ లో ఏర్పాటుచేసిన ఎయిర్ స్ట్రిప్ ను విస్తరించాలని నిర్ణయించారు.

బసంత్ నగర్ పరిసరాల్లో బి.కె.బిర్లాకు చెందిన కేశోరాం సిమెంటు కర్మాగారం ఉండేది. పరిశ్రమను సందర్శించేటప్పుడు తన ఆరు సీట్ల సొంత విమానం దిగేందుకు వీలుగా ఈ ఎయిర్ పోర్టును కేశోరాం సిమెంట్స్ యాజమాన్యం నిర్మించింది. కొన్నాళ్లపాటు హైదరాబాద్ కు ఇక్కడి నుంచి వాయుదూత్ విమానాలు నడిచాయి. ఆ తర్వాత ఈ ఎయిర్‌ స్ట్రిప్ ను మూసేసారు. దశాబ్దంన్నరగా ఈ ఎయిర్‌ స్ట్రిప్ నిరుపయోగంగా పడివుంది.

558 మీటర్ల వెడల్పు, 217 మీటర్ల పొడవున ఇది విస్తరించి ఉంది. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలంటే 2 వేల మీటర్ల పొడవైన రన్‌వే, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 3,500 మీటర్ల వరకు స్థలం కావాలి. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చేసిన సూచన మేరకు అదనంగా 778 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కచ్చితమైన వాతావరణ వివరాలు ఇచ్చేందుకు రామగుండంలో వాతావరణ కేంద్రం ఉంది. ఇది 35 కిలోమీటర్ల పరిధిలోని వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేస్తుంది. ఈ సదుపాయాలన్నీ అందుబాటులో ఉండడంతో బసంత్ నగర్ ఎయిర్ స్ట్రిప్ ను విమానాశ్రయంగా మార్చేందుకు ఏఏఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీన్ని అభివృద్ధి చేసి తొలుత తేలికపాటి విమానాలను నడపాలని నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలు, సందర్శక స్థలాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి సందర్శనకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వీరి సౌకర్యార్థం ఈ విమానాశ్రయం ఎంతో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

అన్ని సానుకూలతలను పరిశీలించి కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనల మేరకు 'ఉడాన్' పథకంలో భాగంగా బసంత్ నగర్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News