India: సీఏఏపై ఆందోళనలో పాల్గొన్న నార్వే టూరిస్టు.. భారత్ నుంచి పంపించేసిన అధికారులు
- నిరసనలో తన అనుభవాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు
- అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా షేర్
- ఆమె వీసా నిబంధనలను ఉల్లంఘించిందన్న అధికారులు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 23న కేరళలోని కొచ్చిలో నార్వేకు చెందిన జాన్నె మెట్టె జాన్సన్ (74) ఈ ఆందోళనలో పాల్గొంది. అంతేగాక, నిరసనలో తన అనుభవాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. దీంతో ఆమెను అధికారులు దేశం నుంచి తిరిగి నార్వేకు పంపించారు.
ఇటీవల అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా జాన్సన్ షేర్ చేసిందని, సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిందని అధికారులు తెలిపారు. ఆమె వీసా నిబంధనలను ఉల్లంఘించిందని వివరించారు. దేశం నుంచి వెళ్లిపోవాలని అధికారులు చెప్పిన తర్వాత తాను నార్వేకు వెళ్లాలని సిద్ధమవుతున్నప్పటికీ అధికారులు మాత్రం విమాన టిక్కెట్ బుక్ చేసేదాకా వదలలేదని ఆమె తెలిపింది.