Rahul Gandhi: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలపై మరో దాడికి రంగం సిద్ధమైంది: రాహుల్ గాంధీ
- ఎన్పీఆర్, ఎన్నార్సీపై రాహుల్ స్పందన
- పెద్ద నోట్ల రద్దుతో పేదలు తీవ్రంగా నష్టపోయారన్న రాహుల్
- ఇప్పుడు కూడా వాళ్లే నష్టపోతారని వ్యాఖ్యలు
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ రేపుతున్న ప్రకంపనలు ఇప్పటికీ ఆగడంలేదు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలపై మరో దాడికి రంగం సిద్ధమైందని, ఎన్పీఆర్, ఎన్నార్సీ ప్రజలపై దాడి చేసేందుకు ఉద్దేశించినవేనని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులకు వెళ్లిన సామాన్య ప్రజలు డబ్బులు తీసుకోలేని పరిస్థితులు కనిపించాయని, దేశం మొత్తమ్మీద 15 నుంచి 20 మంది ధనికులు లాభపడ్డారని తెలిపారు.
ఇప్పుడు ఎన్పీఆర్, ఎన్నార్సీ కూడా అలాంటివేనని అన్నారు. పేద ప్రజలు తమ గుర్తింపు పత్రాలతో అధికారుల వద్దకు వెళితే వారు లంచం అడగడం ఖాయమని రాహుల్ పేర్కొన్నారు. లంచం ఇవ్వకపోతే ఆ పత్రాలను, వాటిలో పేర్లను అధికారులు తారుమారు చేస్తారని వివరించారు. దాంతో మరోసారి పేద ప్రజల జేబులు ఖాళీ అవడం తథ్యమని, ఈసారి కూడా ఆ డబ్బంతా 15 మంది వద్దకే చేరతాయని ఆరోపించారు. ఈ విధంగా ప్రజలపై మరోసారి దాడి జరగనుందని వెల్లడించారు.