Andhra Pradesh: ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి: ఏపీ మంత్రి బుగ్గన
- రాజధాని ప్రకటనకు ముందే నాలుగు వేల ఎకరాలు కొన్నారు
- ఈ భూముల విలువ రూ.16వేల కోట్ల వరకు ఉంటుంది
- మూడు రాజధానుల విషయంపై ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తాం
అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు టీడీపీ పాల్పడిందని... అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికార వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ కొన్న నాలుగువేల ఎకరాల విలువ 16వేల కోట్ల రూపాయలుంటుందని చెప్పారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని ఎకరాలు బయటపడతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అయితే ఇప్పటివరకు దేనిపైనా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో నేటి మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయంపై బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఎక్కడ నెలకొల్పాలి? ఎలా నిర్మాణాలను కొనసాగించాలన్న విషయాలపై ముందుకుపోవడంపై ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని నిర్ణయం జరిగిందన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించామన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక త్వరలోనే వస్తుందని.. దానిపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి తెలిపారు.
రైతులకు న్యాయం జరుగుతుంది
అమరావతి ప్రాంత రైతులకు న్యాయం జరిగితీరుతుందన్నారు. వారికిచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రాజధాని పరిధిలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. సబ్ కమిటీ నివేదికలో కూడా ఆధారాలు పొందుపర్చామన్నారు. రాజధాని ప్రకటన రాకమునుపే కనీసంగా 4070 ఎకరాలు టీడీపీకి చెందిన వ్యక్తులకు అప్పజెప్పారన్నారు. తాము గుర్తించింది తక్కువ భూమేనని.. సీబీఐ రంగంలోకి దిగితే మొత్తం వివరాలు బయటకు వస్తాయని బుగ్గన తెలిపారు.