Chandrababu: ఓ సీనియర్ నాయకుడిగా పోలీస్ వ్యవస్థకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను: చంద్రబాబునాయుడు
- నిన్న కేశినేని నానిని ఎందుకు హోస్ అరెస్ట్ చేశారు?
- నానికి ఏదైనా నోటీసు ఇచ్చారా?
- ‘చట్టం అందరికీ సమానం.. కొందరికి చుట్టం కాదు
విజయవాడలో ధర్నా చౌక్ కు వెళ్లనీయకుండా నిన్న కేశినేని నానిని ఎందుకు హోస్ అరెస్ట్ చేశారు? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాని తన ఇంట్లో నుంచి ధర్నా చౌక్ కు వెళ్లడం తప్పా? హౌస్ అరెస్టు చేస్తున్నామని ఆయనకు ఏదైనా నోటీసు ఇచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు.
ఇటీవల రాజధాని పర్యటనకు తాను వెళ్లినప్పుడు తన కాన్వాయ్ పై రాళ్లు విసిరితే.. నిరసన తెలియజేసే హక్కు ఉందని పోలీసులు మాట్లాడారని, అదేవిధంగా నిరసన తెలిపేందుకు వెళ్లాలనుకున్న నానిని హౌస్ అరెస్టు చేయడం కరెక్టా? అని ప్రశ్నించిన బాబు, ఇందుకు డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సీనియర్ నాయకుడిగా పోలీస్ వ్యవస్థకు కూడా వార్నింగ్ ఇస్తున్నా.. లా అండ్ ఆర్డర్ పాటించండి, ‘చట్టం అందరికీ సమానం.. కొందరికి చుట్టం కాదు’ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని అన్నారు.
‘యువతకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ..మీ భవిష్యత్ కు సంబంధించిన అంశమిది. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి వల్ల, పార్టీ వల్ల మీ భవిష్యత్ అంధకారమవుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది’ అని, ఈ విషయం గురించి ఆలోచించాలని యువతను చంద్రబాబు కోరారు.