Vijayasai Reddy: మీరిద్దరూ కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఎగ్గొడుతున్నారు?: బుద్ధా వెంకన్న
- 4075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని విజయసాయిరెడ్డి అంటున్నారు
- అధికారంలో ఉన్న మీరే విచారణ జరిపించాలి
- ఈ 7 నెలల్లో మీరు చేసిందేమీ లేదు
ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో 1170 ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. కానీ, 4075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని... ఏం పీక్కుంటారో పీక్కోండని తమ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారని చెప్పారు. అధికారంలో ఉన్నది వైసీపీనే అని, విచారణ చేసుకోవాల్సింది కూడా మీరేనని అన్నారు.
ఈ ఏడు నెలల్లో మీరు పీకిందేమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనపై తానే సీబీఐ విచారణ చేయించుకోవాలని కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారేంటి విజయసాయిరెడ్డిగారూ? అంటూ ఎద్దేవా చేశారు. సీబీఐపై మీకున్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా విజయసాయిరెడ్డిగారూ? అని వెంకన్న ప్రశ్నించారు. సీబీఐపై ఎంతో నమ్మకం ఉన్న మీరు, జగన్ గారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఎగ్గొడుతున్నారని అన్నారు. విచారణను త్వరగా చేయాలని జగన్ చేత ఒక లేఖ రాయించాలని దెప్పిపొడిచారు.