Asifabad ST Hostel: గిరిజన హాస్టల్లో కలకలం.. గర్భం దాల్చిన గిరిజన విద్యార్థినులు!
- అసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ వసతి గృహంలో ఘటన
- విద్యార్థినుల నుంచి వివరాలను తెలుసుకుంటున్న ఆర్సీవో
- హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు
అసిఫాబాద్ గిరిజన హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులు గర్భం దాల్చడం సంచలనం రేపుతోంది. చదువుకోమని తమ పిల్లలను పంపిస్తే.. గర్భం దాల్చడం ఏమిటని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు ఇటీవల నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈ పది మందిలో ముగ్గురికి ప్రెగ్నెన్సీ పరీక్షలు పాజిటివ్ గా వచ్చాయని వైద్యులు వెల్లడించారు.
నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు జరిపించగా ఒక్కరికే గర్భం అని వైద్యులు తేల్చారు. దీంతో.. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్సీవో లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలను తెలుసుకుని రికార్డు చేసుకుంటున్నారు. సుమారుగా రెండు నెలలముందే ఈ విషయం తెలిసినప్పటికీ.. సమాచారం అందికపోవడంపై హాస్టల్ సిబ్బందిపై, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.