Telangana election commission: తెలంగాణా రాష్ట్ర ఈసీతో అఖిలపక్ష భేటీ.. మధ్యలోనే కాంగ్రెస్ వాకౌట్

  • మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ను మార్చాలని డిమాండ్
  • ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణ  
  • విపక్షాల ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ఈసీ    

రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే,  తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నేతలు సమావేశంనుంచి మధ్యలోని బయటకు వచ్చారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఈ రోజు ఈసీతో అఖిలపక్షాలు భేటీ అయ్యాయి.

మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ను  ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్న నేపథ్యంలో  కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల నేతలు ఎన్నికల కమిషనర్‌తో వాదనలకు దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేశారన్నారు. ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈసీతో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని చెప్పారు.

ప్రతిగా కాంగ్రెస్ నేతలు, ఈసీ వైఖరిని నిరసిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా మిగతా పార్టీలు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరాయన్నారు. షెడ్యూల్ మార్పుచేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరినప్పటికీ ఈసీ విముఖత చూపిందన్నారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఇతర పార్టీలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇదేరీతిలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ, దళిత బహుజన పార్టీల నేతలు ఈసీ వైఖరిని దయ్యబట్టారు.

  • Loading...

More Telugu News