Bihar: డ్రైవర్‌ను బంధించి ఉల్లి లోడును చోరీ చేసిన దుండగులు

  • బీహార్‌లోని కైమూరు జిల్లాలో ఘటన
  • అలాహాబాద్ నుంచి జహానాబాద్‌కు వెళ్తుండగా ఘటన
  • మారణాయుధాలతో బెదిరించి 102 బస్తాల చోరీ

దేశంలో ఉల్లి ధరలు ఇంకా ఆకాశంలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటి ధరలు మాత్రం నేలకు దిగి రావడం లేదు. దీంతో ఉల్లికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఉల్లి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, బీహార్‌లోని కైమూరు జిల్లాలో ఉల్లి లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను బంధించిన దుండగులు లోడుతో పరారయ్యారు.

బాధిత డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలాహాబాద్ నుంచి బీహార్‌లోని జహానాబాద్‌కు 51 క్వింటాళ్ల ఉల్లి లోడుతో వెళ్తుండగా ఆరుగురు దుండగులు తనను అడ్డగించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డ్రైవర్ పేర్కొన్నాడు. మారణాయుధాలతో బెదిరించి తనను బంధించారని తెలిపాడు. అనంతరం 102 ఉల్లి బస్తాలతో పరారయ్యారని వివరించాడు. డ్రైవర్ దేశ్‌రాజ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News