India: హృదయాన్ని ద్రవింపజేస్తున్న ఈ ఫోటో ఇండియాలోనిది కాదు!
- ఇండియాలోని నిర్బంధ కేంద్రమంటూ ఫోటో
- ఇనుప గ్రిల్ నుంచి బిడ్డకు పాలిస్తున్న తల్లి
- అర్జెంటీనాకు చెందిన చిత్రంగా గుర్తింపు
ఇండియాలోని ఓ నిర్బంధ కేంద్రం. తండ్రిని బిడ్డను బంధించగా, తన బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తల్లి... చూడగానే హృదయం ద్రవించేలా కనిపించే ఈ చిత్రం, గత కొన్ని రోజులుగా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత, సాక్ష్యం ఇదిగో అంటూ ఈ చిత్రాన్ని తెగ వైరల్ చేశారు.
ఈ చిత్రంలో ఇనుప గ్రిల్ కు అవతలివైపున తండ్రి, తన బిడ్డను పట్టుకుని ఉండగా, ఇవతలి వైపు నుంచి తల్లి పాలు పడుతోంది. ఇందులో కనిపిస్తున్న మహిళ ఆమె బంగ్లాదేశ్ కు చెందిన ముస్లిం అని, తండ్రి హిందువు కావడంతో పౌరసత్వ సవరణ చట్టం వీరినిలా వేరు చేసిందని ఓ కథను కూడా ప్రచారం చేశారు. అయితే, ఈ ఫోటో ఇండియాలోనిది కాదని ఇప్పుడు తేలింది.
ఈ చిత్రం అర్జెంటీనాకు చెందిన ఫోటో. దాదాపు ఆరు సంవత్సరాల నాడే... అంటే, 2013లో ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయింది. ఎప్పుడు, ఎక్కడ తీసిన చిత్రమో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం ఇండియాలో వైరల్ అవుతోంది.