IMD: ఉత్తరాదిన ఐఎండీ రెడ్ అలర్ట్!
- సున్నా డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- సాధారణ స్థాయికన్నా అధిక కాలుష్యం
- ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక
ఢిల్లీ, ఉత్తరాంచల్, యూపీ, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోవడంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. చలికితోడు పొగమంచు ప్రభావం అధికంగా ఉండటం, కాలుష్యం సైతం సాధారణ స్థాయికన్నా అధికంగా ఉండటంతో, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
రాత్రి సమయంలో చలి అత్యధికంగా ఉంటుంది కాబట్టి, బయట తిరగవద్దని హెచ్చరించారు. కార్లు తదితర వాహనాల్లో ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ తరువాత ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వర్షాలు పడితే, చలి తీవ్రత కొంతమేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, జనవరి తొలి వారం వరకూ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగవచ్చని అధికారులు పేర్కొన్నారు.