Jagan: ఏపీ సమగ్రాభివృద్ధిపై హై పవర్ కమిటీని వేసిన జగన్... సభ్యులు వీరే!
- జీఎన్ రావు కమిటీపై అధ్యయనం
- మూడు వారాల్లో నివేదిక
- కమిటీలో నీలం సాహ్ని, అజయ్ కల్లం, గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించేందుకు హై పవర్ కమిటీని సీఎం జగన్ నియమించారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం సీఎంఓ ప్రకటించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ ఏర్పడగా, మొత్తం 16 మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకూ స్థానం లభించింది.
చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కమిటీ కన్వీనర్ గా వ్యవహరించనుండగా, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, మేకతోటి సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నానిలతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, అజయ్ కల్లాం సభ్యులుగా ఉంటారు. ఇక ఈ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) నివేదికలను అధ్యయనం చేసి, మూడు వారాల్లోగా సూచనలతో కూడిన నివేదికను ఇవ్వాల్సివుంటుంది. ఈ మేరకు నేడు జీవో జారీ అయింది.