Priyanka Gandhi: ప్రియాంక గాంధీని నెట్టామనడం అవాస్తవం: యూపీ మహిళా పోలీసు అధికారి
- లక్నోలో ప్రియాంక పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణ
- అసలు సంగతి చెప్పిన మహిళా పోలీసు అధికారి
- తానే కిందపడిపోయానని వెల్లడి
లక్నోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు మెడపట్టుకుని నెట్టారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై ప్రియాంక గాంధీ కాన్వాయ్ లో విధులు నిర్వర్తించిన మహిళా పోలీసు అధికారి అర్చన సింగ్ స్పందించారు. ప్రియాంకను నెట్టివేశామనడం అవాస్తవం అని స్పష్టం చేశారు. పైగా, ఆ సమయంలో జరిగిన తోపులాటలో తానే కిందపడిపోయానని అర్చన సింగ్ వెల్లడించారు.
"ఆ పర్యటనలో ప్రియాంక కాన్వాయ్ ఫ్లీట్ ఇన్చార్జిగా నేనే ఉన్నాను. ప్రియాంక పార్టీ ఆఫీసు నుంచి బయల్దేరుతున్నారని నాలుగున్నర గంటల సమయంలో సమాచారం వచ్చింది. దాంతో ఆమె ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. కానీ సగం దూరం వెళ్లేసరికి కాన్వాయ్ నుంచి ఆమె వాహనం తప్పుకుని మరో దిశలో వెళ్లడం ప్రారంభించింది. దాంతో మేం ఏమైందో తెలుసుకునేందుకు వెళ్లగా, ఆమె కారు దిగి నడుచుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు. మేం వద్దని వారిస్తుండగా పార్టీ కార్యకర్తలు ఏమీ చెప్పనివ్వలేదు. ఈ ఘటనలో నేను కిందపడిపోయాను. ఆమె ఓ స్కూటర్ పై కూర్చుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ స్కూటర్ నడుపుతున్న వ్యక్తికి కానీ, ప్రియాంకకు కానీ హెల్మెట్లు లేకపోవడంతో ప్రయాణం సురక్షితం కాదని చెప్పాం. దాంతో ఆమె నడుచుకుంటూ వెళ్లారు" అంటూ అర్చన సింగ్ వివరించారు.