Botsa Satyanarayana: విశాఖకు కొంచెం తోడ్పాటు అందిస్తే చాలు హైదరాబాదును తలదన్నేలా తయారవుతుంది: బొత్స
- విశాఖలో బొత్స ప్రెస్ మీట్
- రెండు నివేదికలు పరిశీలించనున్న హైపవర్ కమిటీ
- త్వరలోనే క్యాబినెట్ లో చర్చిస్తామని వెల్లడి
ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో వచ్చిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ నివేదికలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, వనరులను భేరీజు వేసుకుని రోడ్ మ్యాప్ తయారుచేయాలనేది తమ ఆలోచన అని బొత్స స్పష్టం చేశారు.
పనిలోపనిగా చంద్రబాబునాయుడిపైనా విమర్శలు గుప్పించారు. రాజధానిని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. లక్ష 95 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చి, వాటిలో రూ.5400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఇలాగే ముందుకెళితే కష్టమని భావించామని, అందుకే రాష్ట్రంలో వ్యవసాయ రంగం, నిరుద్యోగ సమస్య, ఇతర అంశాలను ఎలా చక్కదిద్దాలన్న ఉద్దేశంతోనే హైపవర్ కమిటీ వేశామని బొత్స వెల్లడించారు.
అభివృద్ది అంటే సచివాలమో, అసెంబ్లీనో కాదని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, పరిశ్రమలు రావాలని, అభివృద్ధి అంటే అదేనని రైతుల వద్దకు వెళ్లి చెప్పింది చంద్రబాబేనని అన్నారు. "విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతిలో అసెంబ్లీ, సీఎం క్యాంపు కార్యాలయం, గవర్నర్ కార్యాలయం ఉండాలని, కర్నూలులో హైకోర్టు ఉండాలని, అమరావతిలో హైకోర్టు బెంచ్, విశాఖపట్నంలో కూడా హైకోర్టు బెంచ్ ఉండాలని మొన్న వచ్చిన నివేదికల్లో పొందుపరిచారు.
గతంలో హైదరాబాద్ ను వీడి వచ్చేటప్పుడు అలాంటి నగరాన్ని మళ్లీ తయారుచేసుకోగలమా, ఏపీలో ఇలాంటి నగరాన్ని చూడగలమా అని అందరూ బాధపడ్డారు. ఇవాళ ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో అలాంటి నగరాన్ని తయారు చేయగలమంటే అది విశాఖ ఒక్కటే కనిపిస్తోంది. ఇవాళ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో విశాఖ కూడా ఉంది. దీనికి కొంచెం తోడ్పాటు ఇస్తే చాలు హైదరాబాదును తలదన్నేలా రూపొందుతుంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడ్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, కరవుతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలను పైకి తీసుకురావడం మీకు ఇష్టముందా లేదా? మీ చర్యల కారణంగా ఈ ప్రాంతాలన్నీ నష్టపోయాయి. ఓ ప్రాంతంలో టౌన్ షిప్ ఏర్పడితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయే తప్ప ఐదు కోట్ల మంది స్థితిగతులు మారవు" అంటూ అభిప్రాయాలు వెల్లడించారు.