Chiranjeevi: తనను ముందుకు నడిపించిన చీరాల కానిస్టేబుల్ వీరయ్య గురించి చెప్పిన చిరంజీవి!

  • గతంలో ఎస్ఐగా పనిచేసిన చిరంజీవి తండ్రి
  • ప్రమోషన్ పై చీరాల బదిలీ
  • ఆ సమయంలో డిగ్రీ పూర్తిచేసిన చిరు

తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మెగాస్టార్... చిరంజీవి! ఆయన టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2019 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తన తండ్రికి ఎస్ఐగా ప్రమోషన్ రావడంతో చీరాల బదిలీ అయిందని, దాంతో తమ కుటుంబం కూడా చీరాలలో కొంతకాలం ఉందని తెలిపారు. ఆ సమయంలోనే డిగ్రీ పూర్తవడంతో ఎటువైపు అడుగెయ్యాలో తెలియని సందిగ్ధంలో పడిపోయానని, ఆ సమయంలో తన తండ్రి వద్ద పనిచేసే వీరయ్య అనే కానిస్టేబుల్ అందించిన ప్రోత్సాహం మరువలేనని అన్నారు.

"నీకు సినిమా అంటే పిచ్చి... మద్రాస్ వెళ్లడమొక్కటే మార్గం అని వీరయ్య అన్నాడు. మద్రాస్ లో నాకెవరూ తెలియదు, సినిమా చాన్సుల కోసం ఎవర్ని అడగాలో కూడా తెలియదు అని వెనుకంజ వేశాను. నువ్వు అలా అంటే ఎలా, ఓసారి నీ పర్సనాలిటీ చూడు శత్రుఘ్న సిన్హాలా ఉంటావు అన్నాడు.

శత్రుఘ్న సిన్హా అనే మాట వినగానే బాడీ ఉప్పొంగింది. దాంతో వీరయ్య ముందు కొన్ని హిందీ డైలాగులు చెప్పగానే అతను కరతాళధ్వనులతో నన్ను మరింత ప్రోత్సహించాడు. అంతేకాదు, వెంటనే నన్ను ఫొటో స్టూడియోకి వెళ్లి ఫొటోలు తీయించుకుని ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు పంపాలని సలహా ఇచ్చాడు. శత్రుఘ్న సిన్హా కూడా ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేరిన తర్వాతే నటుడయ్యాడని చెప్పాడు.

వీరయ్య ఇచ్చిన సలహాను మరేమీ ఆలోచించకుండా పాటించాను. బ్లైండ్ గా ముందుకెళ్లానంతే. నటుడ్ని అవ్వాలన్న బలమైన కాంక్షతో ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం వృథా కాలేదు. ప్రతి వాళ్ల జీవితంలోనూ ఇలాంటి దశ ఉంటుంది. ఆ సమయంలో ప్రోత్సాహం అందిస్తే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నా సినీ కెరీర్ ప్రారంభం కావడానికి తోడ్పడిన వ్యక్తి వీరయ్య. అతడ్ని మరువలేను" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News