DDCA: డీడీసీఏ మీటింగ్లో చెంపదెబ్బలు, తోపులాట.. గంభీర్ ఫైర్
- డీడీసీఏ సర్వసభ్య సమావేశంలో ఘటన
- ఒకరిపై ఒకరు దాడికి దిగిన సభ్యులు
- డీడీసీఏను రద్దు చేసి సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలన్న గంభీర్
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏ) రసాభాసగా ముగిసింది. నిన్న నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
సభ్యులు గొడవకు దిగుతూ కొట్టుకుంటున్న వీడియోను మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ట్వీట్ చేసి ఇది చాలా అవమానకరమని పేర్కొన్నాడు. 43 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మపై వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు.
వీడియోను పోస్టు చేసిన గంభీర్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డీడీసీఏ చాలా అవమానకరంగా డకౌట్ అయిందని అన్నాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరువు తీసిన డీడీసీఏను వెంటనే రద్దు చేయాలని, బాధ్యులపై జీవితకాల నిషేధం విధించాలని బీసీసీఐ చీఫ్ గంగూలీ, కార్యదర్శి జే షాలను కోరాడు. సమావేశంలో పాస్ చేసిన అజెండాను కొందరు సభ్యులు అంగీకరించకపోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.