Tirumala: వెంకన్న భక్తులపై చలి పులి దెబ్బ!
- తిరుమలలో సాధారణ రద్దీ
- దర్శనానికి 5 గంటల సమయం
- రేపు కోయల్ ఆళ్వార్ తిరుమంజనం
పెరిగిన చలి తీవ్రత తిరుమలకు వచ్చే భక్తులపై పడింది. భక్తుల రాక మందగించింది. దీంతో సప్తగిరులు వెలవెలబోతుండగా, సాధారణ రద్దీ మాత్రమే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చలి పెరుగుతూ ఉండటం, మామూలుగానే చల్లగా ఉండే ఏడుకొండలూ, ఇప్పుడు మరింత చల్లగా ఉండటం, మంచు ప్రభావంతో భక్తుల సంఖ్య తగ్గింది.
సోమవారం ఉదయం 7 కంపార్టుమెంట్లలో మాత్రమే స్వామివారి సర్వదర్శనం నిమిత్తం భక్తులు ఎదురు చూస్తున్నారు. వీరికి దర్శనానికి 5 గంటల వరకూ సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక, దివ్య దర్శనం భక్తుల దర్శనానికి 2 గంటల సమయం పడుతోందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రేపు ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.