Chandrababu: జైలులో రైతులను పరామర్శించిన చంద్రబాబు.. ఏపీ డీజీపీని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నానంటూ ధ్వజం
- ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారు
- ఇది కిడ్నాప్ చేయడమే అవుతుంది
- పోలీసులు రైతులను కిడ్నాప్ చేశారు
- సీఎం ఆదేశాల మేరకు ఎందుకు పనిచేస్తున్నారు?
గుంటూరు జైలులో ఉన్న ఆరుగురు రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించారు. ఆయన వెంట టీడీపీ నేతలు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. మీడియాపై దాడి చేశారంటూ ఆరుగురు రాజధాని రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు జైలుకి తరలించారు.
రైతులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ... 'ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారు. ఇది కిడ్నాప్ చేయడమే అవుతుంది. పోలీసులు కిడ్నాప్ చేశారు. నేరానికి పాల్పడితే నోటీసులు ఇచ్చి వారి బంధువులకు చెప్పి పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కానీ, అలా చేయలేదు' అని అన్నారు.
'రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. డీజీపీని నేరుగా అడుగుతున్నాను. నేను అన్ని పర్మిషన్లు తీసుకుని అమరావతికి వెళ్లాను నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లో కొందరు అన్నారు... ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్న రైతులు నిరసన తెలుపుతుంటే వారిపై ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? నేను డీజీపీని ఒకే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ఇది ప్రజా రాజధాని కోసం చేసే ప్రజా ఉద్యమం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అంతేగానీ, సీఎం ఆదేశాలతో ఎందుకు పనిచేస్తున్నారు?' అని వ్యాఖ్యానించారు.