Renu Pal: ఆస్ట్రియాలో భారత రాయబారిని అర్థాంతరంగా వెనక్కి పిలిపించిన కేంద్రం
- రేణు పాల్ పై నిధుల దుర్వినియోగం ఆరోపణలు
- ప్రాథమిక దర్యాప్తులో నిజనిర్ధారణ
- ఢిల్లీ బదిలీ చేసిన కేంద్రం
- ఆర్థిక అధికారాలపైనా కత్తెర
ఎప్పుడైనా విదేశాల్లోని రాయబారులను వెనక్కిపిలిపించారంటే అందుకు కారణం ఆయా దేశాల్లోని రాజకీయ పరిస్థితులు అనుకూలించని సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ, ఆస్ట్రియాలో భారత రాయబారి రేణు పాల్ ను అర్థాంతరంగా వెనక్కి పిలిపించడానికి కారణం అవినీతి అంటే ఆశ్చర్యం కలగకమానదు. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రేణు పాల్ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలరోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు.
ఆస్ట్రియాలో భారత రాయబారిగా తన ఇంటి అద్దె కోసం రూ.15 లక్షల నిధులు ఖర్చు చేసినట్టు గుర్తించారు. అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. అంతేకాదు, సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి భారీ మొత్తంలో వ్యాట్ రీఫండ్ చేసుకున్నారని రేణు పాల్ పై ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాంతో ఆమెను కేంద్రం వెనక్కిపిలిపించింది. ఢిల్లీకి బదిలీ చేయడంతోపాటు ఆర్థిక అధికారాలపైనా కత్తెర వేశారు.