Congress: యూపీలో పోలీసుల చర్యపై కోర్టుకు వెళతాం: ప్రియాంక గాంధీ
- కార్యకర్తలపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారు
- ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది
- పరిస్థితులు ఇలాగే కొనసాగితే అరాచకానికి దారితీస్తాయి
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలపై యూపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకురాలు, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. ప్రియాంక ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. నిరసన కారులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందన్నారు.
నిరసనలతో సంబంధమున్న వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటించారని ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత భద్రత చిన్న విషయమని, అది చర్చించాల్సిన అంశం కాదని ఆమె అన్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రజల భద్రత అంశాన్నే తాను ప్రస్తావిస్తానని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు. వారు చేపడుతున్న చర్యలు అరాచకానికి దారితీస్తాయన్నారు.